Tesla: ఎలాన్​ మస్క్​ 'యాపిల్'కు సీఈవో అవ్వాలనుకున్నారా?.. వివాదం రేపిన తాజా పుస్తకం.. ఖండించిన దిగ్గజాలు!

  • టెస్లాపై వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్ట్ పుస్తకం
  • కుక్, మస్క్ మధ్య చర్చ జరిగిందన్న ‘పవర్ ప్లే’
  • టెస్లా అమ్మే ప్రయత్నాలంటూ కథనం
  • తానసలు కుక్ తో మాట్లాడనే లేదన్న మస్క్
  • అదే విషయం చెప్పిన యాపిల్ సీఈవో
Book Excerpts Say Musk Wanted To Become Apple CEO

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ యాపిల్ కు సీఈవో అవ్వాలనుకున్నారా? టెస్లాను యాపిల్ కు అమ్మే ప్రయత్నం చేశారా? అంటే వాల్ స్ట్రీట్ జర్నల్ కు చెందిన టిమ్ హిగిన్స్ అనే జర్నలిస్ట్ అవుననే అంటున్నాడు. తాను రాసిన ‘పవర్ ప్లే: టెస్లా, ఎలాన్ మస్క్ అండ్ ద బెట్ ఆఫ్ ద సెంచరీ’ అనే పుస్తకంలో ఆ వివరాలను పేర్కొన్నాడు. టెస్లాను యాపిల్ టేకోవర్ చేసే విషయంపై మస్క్, యాపిల్ సీఈవో టిమ్ కుక్ మధ్య చర్చలు నడిచాయని పేర్కొన్నాడు.

తాజాగా ప్రచురితమైన ఈ పుస్తకంలో కుక్, మస్క్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారని రచయిత పేర్కొన్నాడు. టెస్లా మోడల్ 3 కారును విడుదల చేసినప్పుడు సమస్యలు ఎదురయ్యాయని, దాని గురించి కుక్, మస్క్ మాట్లాడుకున్నారని చెప్పాడు. అయితే, టెస్లాను యాపిల్ కు అమ్మాల్సిందిగా మస్క్ కు కుక్ ప్రతిపాదించారని అందులో తెలిపాడు. దానికి మస్క్ ఒప్పుకొన్నా ఓ షరతు పెట్టారని, తనను టెస్లాకు కాకుండా యాపిల్ కు సీఈవోగా చేస్తే అమ్మేందుకు సిద్ధమని అన్నారని తెలిపాడు. దాంతో కోప్పడ్డ కుక్.. మస్క్ ను తిట్టి, వెంటనే ఫోన్ పెట్టేశారని పుస్తకంలో రచయిత పేర్కొన్నాడు.

దీనిపై మస్క్ తాజాగా స్పందిస్తూ, పుస్తకంలోని రాతలను ఆయన కొట్టిపారేశారు. తామిద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి చర్చ జరగలేదని, తాము ఫోన్ లో గానీ, ఉత్తరాల ద్వారాగానీ మాట్లాడుకోనేలేదని స్పష్టం చేశారు. అసలు తాను టెస్లాను అమ్మాలనుకోలేదని, తాను యాపిల్ సీఈవో కావాలనుకోలేదని ట్వీట్ చేశారు. అప్పట్లో టెస్లా విలువ ఇప్పుడున్న దాంట్లో కేవలం ఆరు శాతమేనన్నారు. ఇక, తాను మస్క్ తో ఎప్పుడూ మాట్లాడలేదని ఇటీవలి ఇంటర్వ్యూలో టిమ్ కుక్ కూడా స్పష్టం చేశారు. ఆయన సంస్థపై తనకు ఎంతో అభిమానం ఉందన్నారు.

More Telugu News