Vedire Rama Chandra Reddy: టాలీవుడ్ లో తెరకెక్కనున్న వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్

  • 1951లో దేశం కోసం 100 ఎకరాల భూమిని దానం చేసిన వెదిరె రామచంద్రారెడ్డి
  • వినోబా భావే పిలుపు మేరకు భూదానం చేసిన మహనీయుడు
  • నిర్మాతగా వ్యవహరించనున్న అల్లు అర్జున్ మామ
Vedire Rama Chandra Reddy biopic in tollywood

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల తెరకెక్కిన పలు బయోపిక్ లు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. తాజాగా మరో మహనీయుడి చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ ప్రియ శిష్యుడైన వినోబా భావే అడగగానే 1951 సంవత్సరంలో 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన వెదిరె రామచంద్రారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కించబోతున్నారు.

వినోబా భావే పిలుపు మేరకు భూమిని దానం చేసిన తొలి భూ ప్రదాతగా రామచంద్రారెడ్డి నిలిచారు. ఆనాడు ఎందరో మహనీయులు వారి జీవితాలను దేశం కోసం త్యాగం చేశారు. అయితే, వారిలో ఎంతో మంది చరిత్రలు ఇప్పుడున్న మనకు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో మరో గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను జనాలకు తెలియజెప్పాలనే గొప్ప ప్రయత్నం జరగుతుండటం సంతోషించదగ్గ విషయం.

ప్రపంచ చరిత్రలో భూమి కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. అయితే, ఒకే పిలుపుతో, ఒక్క రక్తపు బొట్టు కూడా చిందకుండా ఏకంగా 58 లక్షల ఎకరాల భూమిని సేకరించి, పేదలకు పంచిన చరిత్ర మన దేశంలోనే జరిగింది.

భూదాన్ పోచంపల్లి అనే పేరును అందరూ వినే ఉంటారు. అప్పట్లో భూదానం పేరుతో ఈ చిన్న ఊరు చరిత్రకెక్కింది. భూదానానికి స్ఫూర్తిగా నిలిచి, ఎందరో భూస్వాములు వారి భూములు దానం చేసేలా స్ఫూర్తిదాతగా నిలిచిన వెదిరె రామచంద్రారెడ్డి జీవిత చరిత్రే ఈ సినిమా కథాంశం.

ఈ సినిమాకు రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు పని జరుగుతోంది. త్వరలోనే నటీనటులను ఎంపిక చేయనున్నారు. అనంతరం ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

More Telugu News