Kerala: మళ్లీ ముంచుకొస్తున్న మహమ్మారి.. కేరళ, తమిళనాడులో భారీగా కేసులు

  • కేరళలో వరుసగా నాలుగో రోజూ 20 వేలకు పైనే కొత్త కేసులు
  • 13.61 శాతంగా పాజిటివిటీ రేటు
  • ఆగస్టు 8వ తేదీ వరకు తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగింపు
Corona Cases Raising in Kerala and Tamil Nadu

దేశంలో నిన్నమొన్నటి వరకు నెమ్మదించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడులో కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేరళలో నిన్న వరుసగా నాలుగో రోజు కూడా 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజులో 20,772 కేసులు నమోదు కాగా, 116 మంది మృత్యువాత పడ్డారు. కరోనా బారినపడిన వారిలో 81 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉండడం గమనార్హం. రాష్ట్రంలో ఇంకా 1,60,824 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 33,70,137 మంది కరోనా కోరల్లో చిక్కుకోగా, 16,701 మంది మరణించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13.61 శాతంగా ఉంది.

మరోవైపు, తమిళనాడులోనూ కేసులు స్వల్పంగా పెరగడంతో అప్రమత్తమైన ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగించింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉండడంతో ప్రజలెవరూ అనవసరంగా బయట తిరగొద్దని హెచ్చరించింది. అనుమతించిన దానికంటే ఎక్కువమంది గుమికూడిన దుకాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి. రాష్ట్రంలో నిన్న 24 గంటల వ్యవధిలో 1859 కేసులు నమోదు కాగా, 28 మంది మరణించారు. 21,207 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.23 కోట్ల కరోనా డోసులను పంపిణీ చేశారు. 40 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News