పాదయాత్రలో అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్... నిమ్స్ లో చికిత్స

30-07-2021 Fri 19:39
  • హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల పాదయాత్ర
  • గెలుపే లక్ష్యంగా ప్రజా దీవెన యాత్ర
  • మధ్యాహ్నం నీరసించిన ఈటల
  • రక్తపోటు, షుగర్ లెవెల్స్ లో మార్పులు
  • వైద్యుల సూచనమేరకు నిమ్స్ కు తరలింపు
Eatala Rajendar admits NIMS

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అస్వస్థతకు లోనయ్యారు. ప్రజా దీవెన యాత్ర పేరిట చేపట్టిన ఈ పాదయాత్రలో భాగంగా ఈటల నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం కొండపాక వరకు నడిచారు.

అయితే, మధ్యాహ్న భోజనం అనంతరం ఈటల ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించింది. వైద్యులు పరీక్షలు చేయగా, జ్వరం, కాళ్ల నొప్పులతో ఈటల బాధపడుతున్నట్టు వెల్లడైంది. రక్తపోటు తగ్గిందని, షుగర్ లెవెల్స్ పెరిగాయని గుర్తించారు. దాంతో వైద్యుల సూచన మేరకు ఆయనను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.

కాగా, ఈటల ఆసుపత్రి పాలవడంతో పాదయాత్రను ఆయన భార్య జమున కొనసాగించారు. నియోజకవర్గంలోని మూడు గ్రామాల్లో పర్యటించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఈటలకు ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, కోలుకున్న తర్వాత పాదయాత్ర కొనసాగిస్తారని రవీందర్ రెడ్డి తెలిపారు.