ఒడిశాలో పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే పూర్ణచంద్ర

30-07-2021 Fri 19:08
  • కరోనా నేపథ్యంలో అందరినీ పాస్ చేసిన ప్రభుత్వం
  • మార్కులు నచ్చనివాళ్లు పరీక్ష రాసే అవకాశం
  • పరీక్ష రాయడానికి వచ్చిన ఎమ్మెల్యే పూర్ణచంద్ర
  • మీడియా దృష్టిని ఆకర్షించిన వైనం
Odisha MLA Purna Chandra Swain attends tenth class exams

ఒడిశా శాసనసభ్యుడొకరు పదో తరగతి పరీక్షలకు హాజరైన వైనం వెల్లడైంది. ఇవాళ్టి నుంచి ఒడిశాలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వైన్ కూడా ఓ విద్యార్థిలాగా పదో తరగతి పరీక్ష రాశారు. ఆయన దూరవిద్య విధానంలో పది చదివారు. కరోనా నేపథ్యంలో ఒడిశా సర్కారు ఈ ఏడాది అందరినీ పాస్ చేసింది. తాము కేటాయించిన మార్కులు నచ్చనివారు పరీక్షలు రాసే అవకాశాన్ని సర్కారు కల్పించింది. దాంతో, ఎమ్మెల్యే పూర్ణచంద్ర ఎక్కువ మార్కుల కోసం పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నారు.

సూరాడలోని బాలికల ఉన్నతపాఠశాల పరీక్ష కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యేని మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఓ బైక్ పై సాధారణ వ్యక్తిలా వచ్చారు. మరో బైక్ పై సెక్యూరిటీ సిబ్బంది కూడా పరీక్ష కేంద్రం వద్దకు వచ్చారు. కరోనా నేపథ్యంలో థర్మల్ స్క్రీనింగ్ చేసిన అక్కడి సిబ్బంది ఆయనను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.

పూర్ణచంద్ర బీజేడీ పార్టీకి చెందిన నేత. సూరాడ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.