జగన్ కు అన్ని మతాలు ఒక్కటే: సోము వీర్రాజుకు మంత్రి బాలినేని కౌంటర్

30-07-2021 Fri 17:51
  • మతమార్పిళ్లపై వైసీపీ సర్కారును నిలదీసిన సోము
  • సోము వ్యాఖ్యల్లో నిజంలేదన్న బాలినేని
  • తాము హిందువులుగానే ఉన్నామని వెల్లడి
  • ఎవరు ఏ మతమైనా అనుసరించవచ్చని వివరణ
Balineni Srinivasa Reddy counters Somu Veerraju allegations

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం మతమార్పిళ్లను ప్రోత్సహిస్తోందంటూ బీజేపీ నేతలు సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మతమార్పిళ్లకు వైసీపీ ప్రభుత్వమే కారణం అయితే, సీఎం జగన్ బంధువులమైన మేమే మొదట మతం మారాలి కదా? అని బాలినేని ప్రశ్నించారు. సోము వీర్రాజు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఏపీలో పరిస్థితులు లేవని, తామంతా హిందువులుగానే ఉన్నామని స్పష్టం చేశారు.

సీఎం జగన్ అన్ని మతాలను సమానంగా చూస్తున్నారని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా వైసీపీ పాలన సాగుతోందని వివరించారు. చర్చి పాస్టర్లు, మసీదు మౌజన్ లతో పాటు ఆలయాల పూజారులకు కూడా ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తున్న విషయాన్ని వీర్రాజు గుర్తించాలని బాలినేని హితవు పలికారు. సీఎం జగన్ తిరుమల సహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు వెళతారని పేర్కొన్నారు. భారత్ లౌకికవాద దేశమని, ఎవరు ఏ మతం అయినా అనుసరించవచ్చని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి సోము వీర్రాజు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

బాలినేని అటు జల వివాదాల అంశంపైనా స్పందించారు. నదీ జలాలపై చంద్రబాబు రాజకీయాలు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి అంశంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ సర్కారుకు లేఖ రాయాలని స్పష్టం చేశారు.