సీఎం జగన్ కు శాల్యూట్ చేస్తున్నా: ఆర్.నారాయణమూర్తి

30-07-2021 Fri 11:01
  • పెద్ద సినిమాల టికెట్ ధరలను పెంచుకోకుండా జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • చిన్న సినిమాలను బతికించేలా నిర్ణయం తీసుకున్నారని నారాయణమూర్తి కితాబు
  • చిత్ర పరిశ్రమ కొందరి చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆందోళన
R Narayana Murthy salutes Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. పెద్ద హీరోల సినిమాలకు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నారాయణమూర్తి మాట్లాడుతూ, చిన్న సినిమాలను బతికించేలా నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ కు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఎందరో చిన్న నటీనటులకు, చిన్న సినిమాలకు, చిన్న నిర్మాతలకు ఈ జీవో ఆశాకిరణంగా మారిందని అన్నారు.

చిత్ర పరిశ్రమ మొత్తం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోయిందని... ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరికే పరిస్థితి కూడా లేదని అన్నారు. చిన్న సినిమా బాగుంటేనే సినీ పరిశ్రమ బాగుంటుందని చెప్పారు. తాను నిర్మించిన 'రైతన్న' సినిమా ఆగస్టు 15న విడుదలవుతోందని తెలిపారు.