భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు విమానాశ్రయాలకు అనుమతి ఇచ్చామన్న కేంద్రం

30-07-2021 Fri 09:29
  • ఓర్వకల్లులో ఇప్పటికే ప్రారంభమైన కార్యకలాపాలు
  • 2020-21లో ఎయిర్‌పోర్ట్ అథారిటీకి రూ.30,069 కోట్ల ఆదాయం
  • విమానాశ్రయాలకు పేర్లపై కేంద్రానిదే తుది నిర్ణయమన్న వీకే సింగ్
Bhogapuram dagadarthi and Orvakal airport get green signal from centre

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయాలకు అనుమతులు ఇచ్చామని, వీటిలో ఓర్వకల్లు విమానాశ్రయంలో ఈ ఏడాది మార్చి నుంచే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని కేంద్ర పౌరవిమానయాన సంస్థ తెలిపింది. లోక్‌సభలో నిన్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి జనరల్ వీకే సింగ్ పై విధంగా సమాధానమిచ్చారు.

అలాగే, భోగాపురం విమానాశ్రయానికి రూ. 2,500 కోట్లు, దగదర్తికి రూ. 293 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. పీపీపీ/జాయింట్ వెంచర్ విమానాశ్రయాల ద్వారా 2020-21 వరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ. 30,069 కోట్లు సంపాదించినట్టు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు.

కన్సెషన్ ఫీజు రూపంలో హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి 2020-21 కేంద్రానికి రూ. 856 కోట్ల ఆదాయం వచ్చినట్టు వివరించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన మరో ప్రశ్నకు వీకే సింగ్ సమాధానమిస్తూ.. విమానాశ్రయాలు, టెర్మినల్ సముదాయాలకు కొత్త పేర్లు పెట్టడం, ఉన్న పేర్లు మార్చడం వంటి వాటిపై తీర్మానాలు పంపినప్పటికీ తుది నిర్ణయాధికారం మాత్రం కేంద్ర కేబినెట్‌దేనని స్పష్టం చేశారు. కాగా, విమానాశ్రయాలకు పేర్లు పెట్టడం, మార్చడం వంటి వాటికి సంబంధించి ఇప్పటి వరకు 13 రాష్ట్రాలు తీర్మానాలు పంపినట్టు పేర్కొన్నారు.