Lovlina Borgohain: టోక్యో ఒలింపిక్స్.. సెమీస్‌కు దూసుకెళ్లిన యువ బాక్సర్ లవ్లీనా

Lovlina Borgohain wins quarterfinal assures India of medal
  • ప్రపంచ నంబర్ 2 చైనీస్ తైపీపై ఘన విజయం
  • స్వర్ణానికి రెండు బౌట్ల దూరంలో లవ్లీనా
  • ఓడినా కాంస్యం ఖాయం
  • ఆగస్టు 4న టర్కీ క్రీడాకారిణితో సెమీస్ పోరు
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. అసోంకు చెందిన యువ బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్‌లో భాగంగా కొద్దిసేపటి క్రితం చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ నీన్ చిన్‌పై 4-1తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆమెకు పతకం ఖాయమైంది. స్వర్ణానికి రెండు బౌట్ల దూరంలో నిలిచిన లవ్లీనా ఓడినా కాంస్యపతకం గ్యారెంటీ.

లవ్లీనా ప్రస్తుతం వరల్డ్ నంబర్ 3 ర్యాంకర్ కాగా, నీన్ చిన్ ప్రపంచ నంబరు 2 ర్యాంకర్ కావడం గమనార్హం. లవ్లీనా సెమీస్‌లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి అయిన టర్కీ క్రీడాకారిణి బుసెనాజ్ సుర్మెనేలితో ఆగస్టు 4న తలపడుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ఇప్పటి వరకు ఒక్క పతకమే దక్కింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీ విభాగంలో దేశానికి తొలి పతకం (రజతం) అందించింది.

కాగా, లవ్లీనా ఇద్దరు అక్కలైన కవలలు లిచా, లిమా కూడా బాక్సర్లే కావడం విశేషం. 2017లో ఆసియన్ చాంపియన్‌షిప్, 2018లో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో లవ్లీనా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 2020లో ఆసియా అండ్ ఓసియానా బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నీలో విజయం సాధించడం ద్వారా ఒలింపిక్స్ బెర్త్ సంపాదించుకుంది.
Lovlina Borgohain
Tokyo Olympics
Boxing
India
Assam

More Telugu News