జూడో క్రీడాకారిణిని ఆ చెంపా ఈ చెంపా చెళ్లుమనిపించి పంపిన కోచ్... వీడియో వైరల్

29-07-2021 Thu 21:16
  • టోక్యో ఒలింపిక్స్ లో వింత దృశ్యం
  • జూడో పోటీలకు వచ్చిన జర్మనీ క్రీడాకారిణి
  • ఆమె దుస్తులు పట్టుకుని ఊపేసిన కోచ్
  • ఆమె రెండు చెంపలు చెళ్లుమనిపించిన వైనం
Coach slaps German judo fighter

టోక్యో ఒలింపిక్స్ వీక్షిస్తున్న వాళ్లను జూడో ఈవెంట్ సందర్భంగా ఓ దృశ్యం విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేసింది. జర్మనీ జూడో క్రీడాకారిణి మార్టినా ట్రజ్డోస్ పోటీలు జరిగే వేదిక వద్దకు వచ్చింది. ఆమె కూడా ఆ పోటీలో పాల్గొనాల్సి ఉంది. మార్టినాతో పాటు వేదిక వద్దకు వచ్చిన కోచ్ ఒక్కసారిగా ఆమె దుస్తులను పట్టుకుని గట్టిగా ఊపేశాడు. ఆపై ఆమె రెండు చెంపలను చెళ్లుమనిపించాడు. 32 ఏళ్ల ఆ జూడో క్రీడాకారిణి అది తమకు సాధారణమైన విషయమే అన్నట్టుగా జూడో బరిలో దిగేందుకు ముందుకు ఉరికింది.

కాగా, సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. కోచ్ ఇలా కొట్టడం ఏంటని విస్మయానికి గురవుతున్నారు. దీనిపై జర్మనీ జూడో క్రీడాకారిణి మార్టినా ట్రజ్డోస్ స్పందిస్తూ, ప్రతి పోరుకు ముందు అదొక సాధారణ చర్య అని, తనను ఉత్తేజపరచడంలో భాగంగానే కోచ్ ఆ విధంగా చేస్తారని వెల్లడించింది. అంతే తప్ప తనను ఆయన కోపంతో కొట్టడని వివరించింది.