తెలంగాణ నేపథ్యంలో నాని కథ!

28-07-2021 Wed 12:22
  • వరుస సినిమాలతో నాని
  • కొత్త దర్శకులకు అవకాశం
  • శ్రీకాంత్ కథకు గ్రీన్ సిగ్నల్
  • తెలంగాణ యాసపై నాని కసరత్తు  
Nani newmovie update

మొదటి నుంచి కూడా నాని తన సినిమాల మధ్య ఎంతమాత్రం గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాడు. వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా తన సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. అంతేకాదు కథ బాగుండాలే గాని కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వెళుతున్నాడు. అలా ఆయన మరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆ యువ దర్శకుడి పేరే శ్రీకాంత్.

శ్రీకాంత్ ఒక కథను సిద్ధం చేసి .. ఇటీవల నానీకి వినిపించాడట. ఈ కథ తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది .. హీరో తెలంగాణ యువకుడిగా కనిపిస్తాడట. ఈ తరహా పాత్ర రావడం ఇదే మొదటిసారి కావడంతో, నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడతాడు.

అందువలన నాని తెలంగాణ యాసపై కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని చెబుతున్నారు. 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో రాయలసీమ యాసలో అదరగొట్టిన నానీ, ఈ సినిమాలో తెలంగాణ యాసలో అలరించనున్నాడన్న మాట.