యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. రోడ్డుపై నిద్రిస్తున్న 18 మంది కూలీల దుర్మరణం

28-07-2021 Wed 07:58
  • హర్యానా నుంచి కూలీలతో బీహార్ వెళ్తున్న బస్సు
  • బ్రేక్ డౌన్ కావడంతో బస్సు దిగి దాని ముందు నిద్రిస్తున్న కూలీలు
  • ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి
18 Sleeping On Road Dead As Truck Hits Bus

ఉత్తరప్రదేశ్‌లో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. రాజధాని లక్నోకు 28 కిలోమీటర్ల దూరంలో బారాబంకీ జిల్లా రాంస్నేహిఘాట్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. హర్యానా నుంచి కూలీలతో బీహార్‌ వెళ్తున్న బస్సు గత రాత్రి అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో బస్సును బాగు చేస్తుండగా అందులోని కూలీలు కిందికి దిగి దాని ముందు రోడ్డుపై నిద్రపోయారు.

ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై నిద్రిస్తున్న కూలీల్లో 18 మంది అక్కడికక్కడే మరణించారు. వీరందరూ బీహార్‌కు చెందిన వారే. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.