MAA: ‘మా’లో కొత్త మలుపు.. కృష్ణంరాజుకు 15 మంది లేఖలు!

MAA Members write letter to Krishnam Raju
  • తమ పదవీకాలం మార్చితోనే ముగిసిందని లేఖలు 
  • వెంటనే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి
  • రేపు ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం
  • కృష్ణంరాజు అధ్యక్షతన రేపు సమావేశం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని, కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాశారు. మార్చి 2019లో తాము ఎన్నికయ్యామని, ఈ ఏడాది మార్చితో తమ పదవీ కాలం ముగిసిందని ఆ లేఖలలో పేర్కొన్నారు.

 మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు జరగలేదని, దీంతో కార్యవర్గం లేకుండానే నడుస్తోందన్నారు. కాబట్టి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా, ‘మా’లో సీనియర్ సభ్యుడిగా ఉన్నందున మీరే ఆ బాధ్యతలు చేపట్టి తక్షణం ఎన్నికలు చేపట్టాలని ఆ లేఖల్లో విజ్ఞప్తి చేసినట్టు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది.

కాగా, ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం రేపు సాయంత్రం జరగనుంది. ఈ సమావేశానికి మా అధ్యక్షుడు నరేష్ అధ్యక్షత వహించాల్సి ఉండగా, ఆయనకు బదులుగా కృష్ణంరాజు అధ్యక్షత వహించనున్నట్టు సమాచారం. కృష్ణం రాజుకు అందిన లేఖలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
MAA
Tollywood
Elections
Krishnam Raju

More Telugu News