వినాయక చవితికి 'దృశ్యం 2'?

27-07-2021 Tue 19:04
  • 'నారప్ప'తో లభించిన హిట్టు
  • 'దృశ్యం 2'పై పెరుగుతున్న ఆసక్తి
  • లైన్లో 'ఎఫ్ 3' సినిమా
  • సంక్రాంతికి రిలీజ్  
Drushyam 2 will release on Vinayaka Chavithi

వెంకటేశ్ కథానాయకుడిగా చకచకా 'నారప్ప' .. 'దృశ్యం 2' సినిమాలను పూర్తిచేశారు. మొదటిది తమిళ రీమేక్ అయితే, రెండవది మలయాళ రీమేక్. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చాలా తక్కువ సమయంలో ఆయన ఈ సినిమాలను పూర్తిచేశారు. ఈ రెండు సినిమాల్లో 'నారప్ప' అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ కావడం .. అనూహ్యమైన రెస్పాన్స్ రావడం జరిగిపోయాయి.

దాంతో ఇప్పుడు అందరి దృష్టి 'దృశ్యం 2' సినిమాపై ఉంది. ఈ సినిమా కూడా ఓటీటీలోనే రానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. హాట్ స్టార్ వారు భారీ మొత్తం చెల్లించి ఈ సినిమాను కొనుగోలు చేశారనే వార్త ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, 'వినాయక చవితి'కి విడుదల చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు.

మలయాళంలో వచ్చిన 'దృశ్యం 2'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులోను అదే స్థాయిలో రెస్పాన్స్ రావడం ఖాయమనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక ఆ తరువాత సినిమాగా వెంకటేశ్ .. దర్శకుడు అనిల్ రావిపూడితో 'ఎఫ్ 3' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 'సంక్రాంతి'కి భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఇలా వెంకీ పక్కా ప్లానింగ్ తోనే ముందుకు వెళుతున్నారు.