ఓ మగాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పుబట్టని జనాలు... అదేపని ఓ మహిళ చేస్తే తప్పుబడుతున్నారు: వనితా విజయ్ కుమార్

25-07-2021 Sun 21:18
  • మరోసారి వార్తల్లోకెక్కిన నటి వనిత
  • వనిత, తమిళ పవర్ స్టార్ ఫొటో వైరల్
  • నాలుగో పెళ్లి అంటూ నెటిజన్ల వ్యాఖ్యలు
  • స్పందించిన వనిత
Vanitha Vijaykumar gets anger over fourth marriage rumors

తమిళ నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదాలకు మారుపేరుగా నిలిచే వనిత... 2020లో పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కింది. అయితే ఆ పెళ్లి కొన్ని నెలలకు విఫలమైంది. ఈ నేపథ్యంలో వనితకు సంబంధించిన ఓ తాజా ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అందులో వనిత తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్ తో కలిసి ఉంది. ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో దండలు మార్చుకుంటున్నట్టుగా ఉంది. దాంతో, నెటిజన్లు రెచ్చిపోయారు. వనిత నాలుగో పెళ్లి చేసుకుందంటూ ప్రచారం షురూ చేశారు. దీనిపై వనిత స్పందించక తప్పలేదు.

అది రియల్ మ్యారేజి కాదని, ఓ సినిమాకు సంబంధించిన స్టిల్ అని స్పష్టత ఇచ్చింది. అయినా, ఓ మగాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పుబట్టని జనాలు, అదే పని ఓ మహిళ చేస్తే ఎందుకు తప్పుబడుతున్నారు? అని ఆగ్రహంతో ప్రశ్నించింది.

"4 కాదు, 40 పెళ్లిళ్లు చేసుకుంటాను... అయితే ఏంటంట? పెళ్లి అనేది నా వ్యక్తిగత విషయం. ఇక, ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు" అని వనిత స్పష్టం చేసింది.

సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతులకు సంతానంలో ఒకరైన వనిత అనేక సినిమాలు, టీవీ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బిగ్ బాస్ వంటి రియాల్టీ షో ద్వారానూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎక్కువగా ఆమె పేరు వివాదాల్లో వినిపిస్తుంటుంది.