Ramappa Temple: తెలంగాణలోని చారిత్రక రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు

UNESCO recognition for Ramappa Temple in Telangana
  • చైనాలో యునెస్కో వర్చువల్ సమావేశం
  • నిర్ణయం తీసుకున్న వారసత్వ కట్టడాల కమిటీ
  • రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు
  • తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడం
తెలంగాణలోని రామప్ప గుడి అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీక. తాజాగా రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినట్టు యునెస్కో ఓ ప్రకటనలో వెల్లడించింది. తద్వారా కాకతీయ రాజుల కాలం నాటి శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. చైనాలో జరిగిన ఓ వర్చువల్ సమావేశంలో ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప గుడి. 2020 సంవత్సరానికి గాను భారత్ నుంచి ఇదొక్క ఆలయమే నామినేట్ అయింది. 2019లో యునెస్కో ప్రతినిధులు రామప్ప గుడిని సందర్శించారు.

రామప్ప గుడి ములుగు జిల్లా పాలంపేటలో 800 ఏళ్ల కిందట కాకతీయుల హయాంలో నిర్మితమైంది. అపురూప శిల్పాలకు చిరునామాగా విలసిల్లే రామప్ప గుడిని క్రీస్తుశకం 1213లో నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ గుడి శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి రావడం విశేషం అని చెప్పాలి. ఇది ప్రధానంగా శివాలయం. ఇందులో రామలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. దీన్ని కాకతీయ రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఆ కాలంలో ఇంతటి అద్భుత శిల్పకళా నైపుణ్యంతో మరే ఆలయం లేకపోవడంతో, అందులోని దేవుడి పేరుమీద కాకుండా, ఆలయాన్ని తీర్చిదిద్దిన శిల్పి రామప్ప పేరిట పిలవడం ప్రారంభించారు.

రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు."అద్భుతం....తెలంగాణ ప్రజలకు అభినందనలు. ప్రతి ఒక్కరూ ఈ దివ్యమైన కట్టడాన్ని దర్శించాలని కోరుతున్నాను. అక్కడి శిల్ప సౌందర్యాన్ని వీక్షించి ముగ్ధులు కండి" అని ట్వీట్ చేశారు.
Ramappa Temple
UNESCO
Heritage Site
Telangana
Narendra Modi

More Telugu News