Bihar: బీహార్‌లో పోలీసులపై గ్రామస్థుల రాళ్ల దాడి.. మహిళా కానిస్టేబుల్ మృతి

  • పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి
  • పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్థులు
  • కర్రలు, రాళ్లతో దాడి
  • పలువురు పోలీసులకు గాయాలు, ధ్వంసమైన వాహనాలు
Woman Constable Killed In Violence Over Alleged Custodial Death In Bihar

పోలీసులపై గ్రామస్థులు దాడి చేసిన ఘటనలో ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయింది. బీహార్‌లోని జహానాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మద్యం మాఫియాకు చెందిన గోవింద్ మాంఝీ అనే వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందాడు. విషయం తెలిసిన గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు అతడిని తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో హింస చెలరేగింది.

గ్రామస్థులు పోలీసులపై రాళ్లు రువ్వుతూ, కర్రలతో దాడి చేశారు. దీంతో భయపడిన  పోలీసులు వారి బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. గ్రామస్థుల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ కమ్రంలో గ్రామస్థులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న కుంతీదేవి అనే మహిళా కానిస్టేబుల్ పైనుంచి ఓ వాహనం దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది.

విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు అదనపు సిబ్బందితో వచ్చి గ్రామస్థులను అదుపు చేశారు. పోలీసులపై దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో జహానాబాద్-అర్వాల్ రహదారిపై కొన్ని గంటలపాటు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాగా, బీహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉంది. మద్యం విక్రయించే వారికి కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు.

More Telugu News