హుజూరాబాద్ దళితనేతకు స్వయంగా ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

24-07-2021 Sat 20:04
  • త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • గెలిచి తీరాలన్న పట్టుదలతో టీఆర్ఎస్
  • ప్రత్యేకంగా దృష్టి సారించిన సీఎం కేసీఆర్
  • ఎల్లుండి ప్రగతిభవన్ లో దళితులతో భేటీ
  • 427 మందికి ఆహ్వానం
CM KCR talks to Huzurabad dalit leader

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. తాము ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో మరింత బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా దళిత నేతలకు ఫోన్ చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ దళిత నేతలతో ఈ నెల 26న సమావేశం ఉంటుందని, ఈ సమావేశానికి రావాలని వారిని ఆయన ఆహ్వానించారు.

హైదరాబాదు ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశానికి మొత్తం 427 మందిని ఆహ్వానిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను ఎంపిక చేశారు.

ఇవాళ సీఎం కేసీఆర్.... తనుగుల గ్రామం (జమ్మికుంట మండలం) ఎంపీటీసీ భర్త వాసాల రామస్వామితో మాట్లాడారు. జులై 26న మండల కేంద్రాల్లో సమావేశం కావాలని, ఆపై హుజూరాబాద్ చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి హైదరాబాద్ రావాలని వారికి వివరించారు.

ఈ సందర్భంగా మాజీమంత్రి ఈటల రాజేందర్ తన పట్ల వ్యవహరించిన తీరును రామస్వామి సీఎం కేసీఆర్ కు తెలిపాడు. అందుకు కేసీఆర్ స్పందిస్తూ.... ఈటల రాజేందర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఈటల చిన్నవాడని వ్యాఖ్యానించారు. దళిత బంధును హుజూరాబాద్ లో అమలు చేశాక, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని రామస్వామితో చెప్పారు.