రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి దంపతులకు మద్దతు పలికిన టాలీవుడ్ నటి

24-07-2021 Sat 16:39
  • ఇటీవల శిల్పా భర్త రాజ్ కుంద్రా అరెస్ట్
  • అశ్లీల చిత్రాలు తీస్తున్నాడంటూ ఆరోపణలు
  • అవి పోర్న్ చిత్రాలు కాదన్న శిల్పా శెట్టి
  • శిల్పా చెప్పింది నిజమేనన్న గెహనా వశిష్ట్
  • గతంలో అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన గెహనా
Actress Gehana Vasisht supports Shilpa Shetty and Raj Kundra

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన గెహనా వశిష్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. పోర్న్ చిత్రాల వ్యవహారంలో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, రాజ్ కుంద్రా తీసింది శృంగార చిత్రాలే తప్ప పోర్న్ కాదని శిల్పా శెట్టి వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి వాదనలకు గెహనా వశిష్ట్ మద్దతు పలికింది. అవి పోర్న్ చిత్రాలు కాదని గెహనా స్పష్టం చేసింది. ఆ యాప్ లో ఉన్నవి శృంగార భరిత చిత్రాలు మాత్రమేనని పేర్కొంది. "శిల్పా చెప్పింది నిజమే. హాట్ షాట్స్ యాప్ లో ఎప్పుడూ పోర్న్ కంటెంట్ లేదు. లేనిదాన్ని ఉందంటూ మరొకరికి ఎలా అంటగడతారు?" అని గెహనా ప్రశ్నించింది.

గెహనా కూడా అశ్లీల వీడియోల వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటోంది. అశ్లీల చిత్రాలు రూపొందించి, వాటిని పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేస్తోందన్న ఆరోపణలపై ఆమెను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ ఏడాది ఆరంభంలో అదుపులోకి తీసుకున్నారు. గెహనా తెలుగులో 'అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి', 'ప్రేమించు పెళ్లాడు', 'బీ టెక్ లవ్ స్టోరీ', 'నమస్తే', 'ఆపరేషన్ దుర్యోధన', 'ఆపరేషన్ దుర్యోధన-2' చిత్రాల్లో కనిపించింది.