Rangaiah: ఎర్ర గంగిరెడ్డి నేనెవరో తెలియదంటే ఏమనుకోవాలి?: వాచ్ మెన్ రంగన్న

Erra Gangireddy spoke to me many times says Rangaiah
  • ఎర్ర గంగిరెడ్డి నాతో ఎన్నోసార్లు మాట్లాడారు
  • వివేకా హత్యకు ముందు ఇంట్లోకి ఎవరో వచ్చారు
  • వారెవరో నాకు తెలియదు
వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు నోరువిప్పని వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న (రంగయ్య)... ఇప్పుడు సంచలన విషయాలను బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. తన పేరును వెల్లడిస్తే చంపేస్తానని ఎర్ర గంగిరెడ్ది తనను బెదరించారని రంగయ్య చెప్పారు. ఈ నేపథ్యంలో రంగయ్యతో తనకు పరిచయమే లేదని గంగిరెడ్డి చెప్పారు.

మరోవైపు ఈరోజు ఓ టీవీ ఛానల్ తో రంగన్న మాట్లాడుతూ, ఎర్ర గంగిరెడ్డి వివేకాతో ఉంటారని... తనతో ఎన్నోసార్లు మాట్లాడారని... ఇప్పుడు తానెవరో తెలియదని చెపితే ఏమనుకోవాలని ప్రశ్నించారు. వివేకా హత్యకు ముందు అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారని, వారెవరో తనకు తెలియదని అన్నారు. తనకు ఏమీ కాదని సీబీఐ అధికారులు చెపితేనే ఈ విషయాలను వెల్లడించానని చెప్పారు. జమ్మలమడుగు కోర్టులో జడ్జి ముందు నిన్న వాంగ్మూలం తీసుకున్నారని తెలిపారు.
 
అంతకు ముందు గంగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వివేకా తనకు దేవుడితో సమానమని చెప్పారు. చీమకు కూడా తాను అపకారం తలపెట్టనని అన్నారు. వివేకాతో సన్నిహితంగా ఉండటం వల్లే తనపై కేసు పెట్టారని తెలిపారు.
Rangaiah
Ranganna
YS Vivekananda Reddy
Erra Gangireddy
Murder

More Telugu News