NSO Group: పెగాసస్ వంటి టెక్నాలజీల కారణంగా కోట్లాది మంది ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు: ఎన్ఎస్ఓ గ్రూప్

  • సంచలన విషయాలు వెల్లడించిన మీడియా కన్సార్టియం
  • భారత్ సహా పలు దేశాల్లో పెగాసస్ ప్రకంపనలు
  • స్పందించిన పెగాసస్ సృష్టికర్త ఎన్ఎస్ఓ గ్రూప్
  • ఇలాంటి టెక్నాలజీలతో మేలు జరుగుతుందని వెల్లడి
NSO Group said Peagasus like technologies helps people for safer life

భారత రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ వంటి టెక్నాలజీలు జనహితం కోరతాయని ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ అంటోంది. పెగాసస్ స్పైవేర్ సాయంతో తమపై కేంద్రం నిఘా వేసిందని భారత విపక్ష నేతలు, పాత్రికేయులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెగాసస్ సృష్టికర్త ఎన్ఎస్ఓ గ్రూప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇవాళ కోట్లాది మంది ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్నారన్నా, వీధుల్లో సురక్షితంగా నడుస్తున్నారన్నా అందుకు కారణం పెగాసస్ వంటి టెక్నాలజీలేనని పేర్కొంది. నిఘా వర్గాలు, భద్రతా వ్యవస్థల వద్ద ఉండే ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీలతో ఎంతో మేలు జరుగుతుందని వివరించింది. నేరాలను అడ్డుకోవడం, దర్యాప్తు, ఉగ్రవాద నిర్మూలన, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులకు, నిఘా వర్గాలకు ఇటువంటి టెక్నాలజీలే వెన్నుదన్నుగా నిలుస్తాయని తెలపింది. ఈ తరహా సాంకేతికతలకు అందరూ కృతజ్ఞత తెలుపుకోవాలని వ్యాఖ్యానించింది.

తమ వినియోగదారులు సేకరించే డేటాను తాము పరిశీలించబోమని, వారి వద్ద ఉన్న సాఫ్ట్ వేర్ ను తాము నియంత్రించబోమని ఎన్ఎస్ఓ స్పష్టం చేసింది.

ఇటీవల అంతర్జాతీయ మీడియా కన్సార్టియం వెల్లడించిన వివరాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రకంపనలు సృష్టించాయి. పెగాసస్ స్పైవేర్ సాయంతో అనేక దేశాల్లోని రాజకీయనేతలు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలపై నిఘా వేశారని కన్సార్టియం వెల్లడించింది. దాంతో భారత్ సహా పలు దేశాల్లో పెగాసస్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పెగాసస్ రూపకర్త ఎన్ఎస్ఓ గ్రూప్ స్పందించింది.

More Telugu News