Tokyo Olympics: ప్రేక్షకులు లేకుండానే ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్

Tokyo Olympics has been kicked off
  • జపాన్ రాజధాని వేదికగా 32వ ఒలింపిక్ క్రీడలు
  • ప్రారంభించిన జపాన్ చక్రవర్తి నరుహిటో
  • మార్చ్ పాస్ట్ లో తొలుత గ్రీస్ బృందం రాక
  • ఆపై శరణార్థుల జట్టు రాక
జపాన్ రాజధాని టోక్యోలో 32వ ఒలింపిక్ క్రీడలు ఆరంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహిటో, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ లాంఛనంగా ఈ విశ్వక్రీడోత్సవాన్ని ప్రారంభించారు. లేజర్ తళుకులు, బాణసంచా మెరుపులు, జిగేల్మనిపించే విద్యుద్దీప కాంతులు, కళాకారుల విన్యాసాల నడుమ క్రీడలు షురూ అయ్యాయి. ప్రేక్షకులే లేకపోవడం ఒక్కటే లోటు!

తొలుత గ్రీస్ అథ్లెట్లు తమ జాతీయ పతాకం చేతబూని మార్చ్ చేశారు. అనంతరం శరణార్థుల జట్టు మార్చ్ పాస్ట్ లో పాల్గొంది. జపాన్ భాష అక్షర క్రమం ప్రకారం ఆయా దేశాలు మార్చ్ పాస్ట్ లో వరుసగా రానున్నాయి.

కాగా, ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా బంగ్లాదేశ్ కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ కు ఒలింపిక్ లారెల్ అవార్డు ప్రదానం చేశారు. ఒలింపిక్ క్రీడలు నేటి నుంచి ఆగస్టు 8 వరకు అలరించనున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతించడంలేదు.

మార్చ్ పాస్ట్ లో భారత బృందానికి బాక్సర్ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ నేతృత్వం వహించారు. భారత బృందంలో 20 మంది అథ్లెట్లు, ఆరుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. మేరీకోమ్, మన్ ప్రీత్ జాతీయ పతాకం చేతబూని ముందు నడస్తుండగా, భారత అథ్లెట్లు వారిని అనుసరించారు.
Tokyo Olympics
Opening Ceremony
Tokyo
Japan

More Telugu News