కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం

23-07-2021 Fri 15:56
  • ఆకాశ్ ను మరింత ఆధునికీకరించిన డీఆర్డీవో
  • ఒడిశా తీరం నుంచి ఆకాశ్-ఎన్జీ పరీక్ష
  • విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి
  • ఇనుమడించనున్న భారత వాయుసేన సత్తా
DRDO successfully test fires new age Akash NG missile

ఇటీవల కాలంలో పొరుగుదేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అమ్ముల పొదిలోని అస్త్రాలకు భారత్ మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలో, మరింత ఆధునికీకరించిన ఆకాశ్-ఎన్జీ క్షిపణిని నేడు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ టెస్టింగ్ రేంజ్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఉదయం 11.45 గంటలకు దూసుకెళ్లిన ఆకాశ్-ఎన్జీ మిస్సైల్ నింగిలో వేగంగా వెళుతున్న లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.

నిన్న కూడా ఇదే తరహా పరీక్ష నిర్వహించగా, శాస్త్రవేత్తల అంచనాల మేరకు ఆకాశ్ క్షిపణి సంతృప్తికరంగా లక్ష్యాన్ని తాకింది. ఆకాశ్ ను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇది ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి. దీని రేంజి 30 కిలోమీటర్లు. ఎన్నో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం అయిన ఆకాశ్-ఎన్జీ క్షిపణి చేరికతో భారత వాయుసేన పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు.