పదేళ్లలో కట్టాల్సిందే: ఏజీఆర్​ బకాయిలపై టెలికం సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం

23-07-2021 Fri 14:12
  • బకాయిలను మళ్లీ లెక్కించాలన్న వ్యాజ్యం కొట్టివేత
  • 2031 మార్చి 31 నాటికి కట్టాలని ఆదేశం
  • ఇవ్వాళ తీర్పు వెలువరించిన ధర్మాసనం
Supreme Court Asks Telcos To Pay AGR dues By 2031

వొడాఫోన్ ఐడియా (వీఐ), భారతి ఎయిర్ టెల్, టాటా టెలీసర్వీసెస్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) బాకీలను మరోసారి లెక్కించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది. ప్రస్తుతం నిధుల కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సంస్థలకు ఇది పెద్ద దెబ్బే. టెలికం సంస్థల పిటిషన్ ను జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హృషికేశ్ రాయ్ ల ధర్మాసనం కొట్టేసింది.

జులై 19, జులై 22న ఆ సంస్థలు వేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. ఇవ్వాళ తీర్పును వెలువరించింది. ప్రభుత్వానికి ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. 2031 మార్చి 31 నాటికి పదేళ్లలో పది ఇన్ స్టాల్ మెంట్ల కింద చెల్లించాలని స్పష్టం చేసింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై పున:సమీక్ష జరిపేది లేదని జులై 19 నాటి విచారణ సందర్భంగా జస్టిస్ ఎల్.ఎన్.రావు నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేశారు.

కాగా, ఏజీఆర్ బకాయిలను తప్పుగా లెక్కించారని, మరోసారి బకాయిలను లెక్కించాలని కోరుతూ టెలికం సంస్థలు జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.