Ashok Gajapathi Raju: అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు

  • అశోక్ తో పాటు 10 మంది మాన్సాస్ ఉద్యోగులపై కేసు నమోదు
  • జీతాలు చెల్లించడం లేదంటూ ఈవోతో వాగ్వాదానికి దిగిన ఉద్యోగులు
  • కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని కేసు నమోదు
Police case filed against Ashok Gajapathi Raju

టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై పోలీసు కేసు నమోదైంది. ఆయనతో పాటు మాన్సాస్ కు చెందిన 10 మంది ఉద్యోగులపై విజయనగరం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మాన్సాస్ ట్రస్ట్ ఈవో గత 19 నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని... ఈ నెల 17న అశోక్ గజపతిరాజు వద్ద మాన్సాస్ ఉద్యోగులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం ఈవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జీతాలను ఎందుకు ఇవ్వడం లేదని ఈవోను నిలదీశారు. ఈ క్రమంలో ఈవోకు, ఉద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరేపించారనే ఆరోపణలతో అశోక్ పై పోలీసులు కేసు పెట్టారు. అశోక్ గజపతిరాజు, ట్రస్ట్ కరస్పాండెంట్ సహా 10 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు స్పందిస్తూ, పోలీసులు తమపై అన్యాయంగా కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాలను చెప్పుకోవడానికి వెళ్తే కేసులు పెడతారా? అని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News