Afghanistan: ఆఫ్ఘన్ సైనికులకు మద్దతుగా అమెరికా విమాన దాడులు.. ప్రకటించిన పెంటగాన్

Pentagon Says It Carried Out Air Strikes in Afghanistan
  • తాలిబన్లే లక్ష్యంగా దాడులు  
  • గోప్యంగా మరిన్ని వివరాలు
  • నెలలో ఏడు జరిగాయంటున్న అధికారులు
  • డ్రోన్లతోనే చేశారని కామెంట్
తాలిబన్ల దూకుడుతో దావాగ్నితో రగిలిపోతున్న ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా విమాన దాడులు చేసింది. ప్రస్తుతం తాలిబన్లతో పోరాడుతున్న ఆఫ్ఘన్ సైనిక బలగాలకు మద్దతుగా కొన్ని రోజుల నుంచి దాడులు చేస్తున్నట్టు పెంటగాన్ ప్రకటించింది. అయితే, ఆ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

‘‘ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కు మద్దతుగా కొన్ని రోజుల నుంచి అక్కడ మేం విమాన దాడులు చేస్తున్నాం. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే. ఆ దాడులకు సంబంధించిన వ్యూహాత్మక సమాచారాన్ని మాత్రం చెప్పలేను’’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ బలగాలకు తమ తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి బలగాలు పూర్తిగా వెనక్కు వచ్చే దాకా.. అక్కడ విమాన దాడులు చేసేందుకు సెంట్రల్ కమాండ్ జనరల్ కెనెత్ ఫ్రాంక్ మెకంజీకి పూర్తి అధికారాలు ఇచ్చారు. కాగా, నెల వ్యవధిలో సుమారు ఏడు విమాన దాడులు చేశారని అమెరికా రక్షణ అధికారి ఒకరు చెప్పారు. దాడుల కోసం ఎక్కువగా డ్రోన్లనే వాడుకున్నారని చెప్పారు. తాలిబన్లు ఆక్రమించుకున్న సైనిక పరికరాలు, స్థావరాలను వారి చెర నుంచి విడిపించేందుకే ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది.

కాగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి బలగాల వాపస్ దాదాపు 95 శాతం పూర్తయిందని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే, ఆఫ్ఘన్ లో అమెరికా దౌత్య ప్రాబల్యాన్ని కొనసాగించేందుకు 650 మంది బలగాలను అక్కడే ఉంచనున్నట్టు తెలుస్తోంది.
Afghanistan
USA
Pentagon
Taliban

More Telugu News