మూడు ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి వరద

22-07-2021 Thu 13:43
  • జూరాల నుంచి 50 వేల క్యూసెక్కులు
  • విద్యుదుత్పత్తి ద్వారా సాగర్ కు నీటి విడుదల
  • ప్రాజెక్టులో ప్రస్తుతం 70.8 టీఎంసీల నిల్వ
Inflows Continue To Srisailam

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. స్థానికంగా పడుతున్న ఎడతెరిపి లేని వానలతో జలాశయాలు నిండుతున్నాయి. కృష్ణా, గోదావరిలకు భారీ వరదలు వస్తున్నాయి. కృష్ణా ప్రాజెక్టులకు కొన్ని రోజులుగా వరద కొనసాగుతోంది. జూరాలకు ఎగువన ఉన్న నారాయణపూర్, ఆల్మట్టిల నుంచి వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఓపెన్ చేసి దిగువన శ్రీశైలానికి వదులుతున్నారు.

జూరాలతో పాటు సుంకేసుల, హంద్రీ రిజర్వాయర్ల నుంచి కూడా శ్రీశైలానికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం జూరాల నుంచి 50,028 క్యూసెక్కుల వరద వస్తోంది. సుంకేసుల నుంచి 2,215, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల జలాలు ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. దీంతో శ్రీశైలం ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో కరెంట్ ను ఉత్పత్తి చేస్తూ.. దిగువన నాగార్జున సాగర్ కు 15,713 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి సామర్థ్యం 890 అడుగులకుగానూ ప్రస్తుతం 845.4 అడుగుల నీటి మట్టం ఉంది. 70.8225 టీఎంసీల నీటి నిల్వ ఉంది.