'డియర్ మేఘ' నుంచి టీజర్ రిలీజ్!

22-07-2021 Thu 12:25
  • తెలుగు తెరకి మరో ప్రేమకథ 
  • దర్శకుడిగా సుశాంత్ రెడ్డి పరిచయం 
  • ఆకట్టుకుంటున్న టీజర్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
Dear Megha movie teaser released

చాలా చిన్న వయసులోనే మేఘ ఆకాశ్ వెండితెరకి పరిచయమైంది. అయితే, తెలుగులో ఇంతవరకూ చేసిన సినిమాలు ఆమెకి హిట్ ఇవ్వలేకపోయాయి. దాంతో సహజంగానే అంతగా దూకుడు చూపించలేకపోతోంది. 'డియర్ మేఘ' సినిమాతో ఈ సారి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆమె ఉంది. అరుణ్ ఆదిత్ .. అర్జున్ సోమయాజుల ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో ఆమె కథానాయికగా అలరించనుంది.

ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన 'ఆమని పక్కనుంటే' అనే లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ వదిలారు. టీజర్ ను బట్టి,  'ప్రేమతో నడిచింది ఒకరితో .. పెళ్లి కుదిరింది మరొకరితో' అనే కాన్సెప్ట్ తో నడిచే కథగా అనిపిస్తోంది. "నిన్ను చూసినన్ని సార్లు బుక్స్ చూసుంటే క్లాస్ లో టాపర్ అయ్యుండేదానిని". "అతి ఎక్కువ సంతోషానికైనా .. అతి ఎక్కువ బాధకైనా కారణం ప్రేమే అవుతుంది" అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాతో సుశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆయన ఈ టీజర్ ను కట్ చేసిన తీరు బాగుంది .  సున్నితమైన భావోద్వేగాలు .. లోతైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా తెలుగులో సరైన బ్రేక్ కోసం మేఘ ఆకాశ్ ఎదురుచూస్తోంది. ఈ సినిమా ఆమె కెరియర్ కి హెల్ప్ అయ్యేలానే అనిపిస్తోంది మరి.