బాలానగర్ ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

21-07-2021 Wed 15:52
  • లైసెన్స్ తీసుకునేందుకు వెళ్తూ మృత్యువాత
  • అతి వేగానికి తోడు హెల్మెట్ లేకపోవడంతో తీవ్ర గాయాలు
  • మృతుడు ప్రకాశం జిల్లా వాసి
Road accident in Balanagar flyover man died

అతివేగానికి తోడు హెల్మెట్ లేని ప్రయాణం ఎంత ప్రమాదకరమో చెప్పే ఘటన ఒకటి నేడు హైదరాబాద్ బాలానగర్‌లో జరిగింది. ఇటీవల ప్రారంభమైన బాలానగర్ ఫ్లై ఓవర్‌పై అతివేగంగా బైక్ నడుపుతూ అదుపుతప్పిన ఓ యువకుడు ఫ్లై ఓవర్ డివైడర్‌ను ఢీకొట్టి మరణించాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా కొణిదెనకు చెందిన అశోక్ (24) లారీ డ్రైవర్. హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఉండే తన సోదరుడి ఇంటికి వచ్చిన అశోక్.. లైసెన్స్ తీసుకునేందుకు ఈ ఉదయం తిరుమలగిరి కార్యాలయానికి బైక్‌పై బయలుదేరాడు.

బాలానగర్ ఫ్లై ఓవర్ పైనుంచి అతి వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఎడమవైపు ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. తలకు హెల్మెట్ లేకపోవడంతో  తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.