మహమ్మారి సమయంలో దేశంలో లెక్కలోకి రాని మరణాలు 49 లక్షలు!: అమెరికా సంస్థ నివేదిక

21-07-2021 Wed 14:25
  • అమెరికా సంస్థ అధ్యయనంలో వెల్లడి
  • ఒక్క మేలోనే 1.7 లక్షల మంది మృతి
  • ప్రతి దేశమూ ఆడిట్ చేయాలన్న డబ్ల్యూహెచ్ వో
Indias Excess Deaths During Pandemic Likely Up To 49 lakh

మన దేశంలో కరోనా మహమ్మారి సమయంలో లక్షలాది లెక్కలోకి రాని మరణాలు నమోదయి ఉంటాయని ఓ అధ్యయనం నివేదిక వెల్లడించింది. దాదాపు 49 లక్షల మరణాలు లెక్కలోకి రాలేదని అమెరికాలోని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్ పేర్కొంది. మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలోని బృందం.. ఈ అధ్యయనం చేసింది. మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని రకాల మరణాలపై విశ్లేషించింది.

ప్రస్తుతం దేశంలో నమోదైన కరోనా మరణాలపై ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సెకండ్ వేవ్ లో ఒక్క మే నెలలోనే 1.7 లక్షల మంది చనిపోయారని పేర్కొంది. కరోనా మహమ్మారి సమయంలో 34 లక్షల నుంచి 49 లక్షల వరకు అదనపు మరణాలు నమోదై ఉంటాయని తెలిపింది. అయితే, అవన్నీ కూడా కరోనా మహమ్మారి వల్లే సంభవించినవని చెప్పలేమని, దానికి ఎన్నో కారణాలూ ఉండి ఉంటాయని స్పష్టం చేసింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అయితే, ప్రతి దేశమూ లెక్కలోకి రాని మరణాలపై ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. భవిష్యత్ లో వచ్చే మరిన్ని ముప్పులను ఎదుర్కొనేందుకు అదొక్కటే పరిష్కారమన్నారు.