హారర్ థ్రిల్లర్ గా రానున్న 'జ' .. ట్రైలర్ రిలీజ్!

20-07-2021 Tue 19:24
  • మరో దెయ్యం సినిమా 
  • ప్రధాన పాత్రలో హిమజ 
  • దర్శకుడిగా సైదిరెడ్డి పరిచయం 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
JA movie trailer released

హిమజ ప్రధాన పాత్రలో 'జ' అనే హారర్ థ్రిల్లర్ రూపొందింది. గోవర్ధన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, సైదిరెడ్డి దర్శకుడిగా వ్యవహరించాడు. తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వెళుతున్న హిమజకు, బిగ్ బాస్ సీజన్ 3 మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి మరింతగా ఆమె వెండితెరపైన .. బుల్లితెరపైన కూడా సందడి చేస్తూనే వస్తోంది. అలాంటి ఆమె తాజా చిత్రంగా 'జ' నిర్మితమైంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

నాయిక .. ఆమె భర్త ఊరికి దూరంగా ఉన్న ఒక పెద్ద బంగ్లాలో నివాసం ఉంటారు. అర్థరాత్రివేళలో ఆమెకి చిత్రమైన.. భయానకమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. దాంతో ఆమె ప్రవర్తనలో మార్పు వస్తుంది .. అది ఆమె భర్తకి విచిత్రంగా అనిపిస్తుంది. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలపై ట్రైలర్ ను కట్ చేశారు. ఆ బంగ్లాలో అలా ఎందుకు జరుగుతోంది? అందుకు కారకులు ఎవరు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడవనుంది. సుడిగాలి సుధీర్ .. గెటప్ శ్రీను .. ప్రతాప్ రాజు .. ప్రీతీ నిగమ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.