తెలంగాణలో డెల్టా వేరియంట్ ప్రభావం ఇంకా తగ్గలేదు: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్

20-07-2021 Tue 17:33
  • కరోనా కేసులు తగ్గుతున్నా.. డెల్టా వేరియంట్ వ్యాపిస్తోంది
  • మరో రెండు నెలలు డెల్టా వేరియంట్ ప్రభావం ఉంటుంది
  • పండుగల కాలంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి
Delta variant is spreading fast in Telangana

ప్రపంచాన్ని కరోనా వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా ఈ వేరియంట్ ముప్పు తగ్గలేదని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గాలి ద్వారా డెల్టా వేరియంట్ వ్యాపిస్తోందని అన్నారు. ఈ వేరియంట్ ప్రభావం మరో రెండు నెలల వరకు ఉంటుందని హెచ్చరించారు.

మరోవైపు కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టాయని శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి నుంచి పండుగలు వరుసగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కరోనా ప్రమాదాన్ని పట్టించుకోకుండా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్క్ లేకుండా ఉత్సవాల్లో పాల్గొనరాదని అన్నారు.

ఇదే సమయంలో రాజకీయ నేతలకు కూడా డాక్టర్ శ్రీనివాస్ చురక అంటించారు. తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలు పెరిగాయని, మాస్కులు కూడా ధరించకుండానే రాజకీయ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. లక్షలాది మంది వైద్య సిబ్బంది కరోనా కట్టడి కోసం నిరంతరం పనిచేస్తూ అలసిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంట్లో కూడా మాస్కులు ధరించాలని సూచించారు.