పోలవరం నిర్వాసితులను తరలించడంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం

20-07-2021 Tue 16:13
  • సీఎస్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ లకు నోటీసులు
  • పునరావాసం కల్పించకుండానే ఎలా తరలిస్తారని ప్రశ్న
  • 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
National SC Commission issues notice to AP CS

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను బలవంతంగా తరలించడంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ తో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, కేంద్ర జలశక్తి కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని షెడ్యూల్డ్ కులాల నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించడంపై నివేదిక కోరింది.

నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ ఈ మేరకు స్పందించింది.