మీ బెయిల్ రద్దు చేయమని కోరితే రాజద్రోహం ఎలా అవుతుంది?: రఘురామకృష్ణరాజు

20-07-2021 Tue 15:47
  • నాపై అనర్హత వేటు పడే అవకాశమే లేదు
  • అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇంతకాలం వైసీపీ నేతలు నిందలు వేశారు
  • పెగాసస్ సాఫ్ట్ వేర్ ను చాలా మందిపై మీరు వాడారని అంటున్నారు
How it will be sedition when I ask to cancel your bail questions Raghu Raju

తనపై అనర్హత వేటు పడే అవకాశమే లేదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కోసం రాజ్యసభ వెల్ లోకి వెళ్లి విజయసాయిరెడ్డి నిరసన వ్యక్తం చేశారని... అయితే, తనపై అనర్హత వేటు వేస్తే నిరసనలు ఆపేస్తామని కూడా ఆయన అన్నట్టు తనకు తెలిసిందని అన్నారు. అయితే, ఇది నిజమో, కాదో తనకు తెలియదని చెప్పారు.  మీ బెయిల్ ను రద్దు చేయమని కోర్టును కోరితే రాజద్రోహం ఎలా అవుతుందని సీఎం జగన్ ను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇంతకాలం వైసీపీ నేతలు నిందలు వేశారని... సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు వారేమంటారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరువల్ల 150 మందికి పైగా రైతులు మృతి చెందారని... వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.

తమ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని రఘురాజు అన్నారు. దసపల్లా హోటల్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ పై నిజాయతీ కలిగిన అధికారితో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయాలని జగన్ ఆదేశిస్తే... వైసీపీకి చెందిన ఎంపీలందరూ రాజీనామా చేస్తే, కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని చెప్పారు. రాజీనామా చేయడానికి తాను సిద్ధమని... ఆజ్ఞాపించడానికి మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను చాలా మందిపై మీరు వాడారని అంటున్నారని... అది వాడటానికి మీరు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారు.