మాస్ ఆడియన్స్ కి పండగే .. మరోసారి పూరితో బాలయ్య!

20-07-2021 Tue 10:27
  • షూటింగు దశలో 'అఖండ'
  • లైన్లో గోపీచంద్ మలినేని
  • అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్
  • మరోసారి పూరి జగన్నాథ్ తో
Balakrishna in Puri movie

బాలకృష్ణ తన సినిమాల మధ్య గ్యాప్ రానివ్వరు. ఒక సినిమా పూర్తవుతూ ఉండగానే, మరో సినిమాను ఆయన లైన్లో పెడుతూ ఉంటారు. సినిమా హిట్ అయినా .. సరిగ్గా ఆడకపోయినా ఆ విషయాలను గురించి ఆయన పెద్దగా పట్టించుకోరు. నెక్స్ట్ ఏంటి? అన్నట్టుగానే ఆయన ముందుకు వెళుతుంటారు. అయితే గతంతో పోలిస్తే బాలకృష్ణ ఇప్పుడు మరింత స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తోంది. ఒకేసారి ఆయన రెండు మూడు ప్రాజెక్టులను సెట్ చేయడం ఈ మధ్య కాలంలో కనిపిస్తోంది. అలా తాజాగా ఆయన దర్శకుల జాబితాలో పూరి జగన్నాథ్ పేరు వినిపిస్తోంది.

బాలకృష్ణ - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇంతకుముందు 'పైసా వసూల్' సినిమా వచ్చింది. బాలయ్య మాస్ అభిమానులను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమాలో బాలకృష్ణ లుక్ కి మంచి మార్కులు పడిపోయాయి. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు సెట్ కానున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ దిశగా సన్నాహాలు మరింత ముందుకు వెళుతున్నాయని టాక్ బలంగా వినిపిస్తోంది. బోయపాటితో 'అఖండ' తరువాత గోపీచంద్ .. అనిల్ రావిపూడి సినిమాలు బాలయ్య చేయనున్నారు. ఆ తరువాత పూరి సినిమా ఉంటుందని అంటున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లోనూ ఒక సినిమాను చేయడానికి ఆయన అంగీకరించడం విశేషం.