మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన కంభంపాటి హరిబాబు

20-07-2021 Tue 07:27
  • ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌లో నిన్న సాయంత్రం ప్రమాణ స్వీకారం   
  • కరోనా కారణంగా హాజరు కాని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • హాజరైన కంభంపాటి కుటుంబ సభ్యులు
Kambhampati Hari Babu takes oath as Governor of Mizoram

మిజోరం గవర్నర్‌గా ఇటీవల నియమితులైన కంభంపాటి హరిబాబు నిన్న సాయంత్రం గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌లో సాయంత్రం నాలుగున్నర గంటలకు గువాహటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ జోథాన్‌ఖుమా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

నిజానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాంసు ధులియా ఈ ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది. అయితే, ఆయన కుటుంబ సభ్యులు కరోనాతో బాధపడుతుండడంతో ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోయారు. హరిబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంథంగా, మంత్రులు, అధికారులతోపాటు హరిబాబు భార్య జయశ్రీ, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.