ఐదేళ్లలో దేశద్రోహం కేసులు ఎన్ని నమోదయ్యాయో తెలుసా?

19-07-2021 Mon 15:25
  • 2014-19 కాలంలో 326 కేసుల నమోదు
  • కేవలం ఆరు సందర్భాల్లో మాత్రమే శిక్షలు ఖరారు
  • 54 కేసులతో అగ్ర స్థానంలో అసోం
326 sedition cases filed in India in 5 years

ప్రస్తుతం మన దేశంలో రాజద్రోహం (దేశద్రోహం) కేసు అత్యంత వివాదాస్పదంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఈ చట్టాన్ని వాడుతున్నాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. స్వాతంత్ర్య సమరయోధులను కట్టడి చేసేందుకు ఎప్పుడో బ్రిటీష్ వలస పాలకులు తీసుకొచ్చిన దేశద్రోహం చట్టం ఇప్పుడు మనకు అవసరమా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

మరోవైపు 2014 నుంచి 2019 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా మొత్తం 326 దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం కేసుల్లో కేవలం ఆరింట్లో మాత్రమే అభియోగాలు రుజువయ్యాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకు కేవలం ఆరు సందర్భాల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. ఈ వివరాలను కేంద్ర హోంశాఖ తెలిపింది.  

రాజద్రోహం చట్టం కింద 2014-19 మధ్య అసోంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 54 కేసులతో అసోం అగ్ర స్థానంలో నిలిచింది. ఈ 54 కేసుల్లో 26 కేసులకు సంబంధించి అభియోగపత్రాలు దాఖలు కాగా... 25 కేసుల్లో విచారణ ముగిసింది. అయితే ఈ 25 కేసుల్లో ఏ ఒక్క కేసులో కూడా ఆరోపణలు రుజువు కాలేదు. అసోం తర్వాతి స్థానాల్లో ఝార్ఖండ్ 40 కేసులు, హర్యానా 31 కేసులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే 2020 గణాంకాలు ఇంకా సిద్ధం కాలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది.