అచ్చం కోహ్లీలా వున్న ఇషాన్ ఫొటోల‌ను చూసి వైర‌ల్ చేస్తోన్న నెటిజ‌న్లు!

19-07-2021 Mon 12:25
  • నిన్న శ్రీ‌లంక‌తో తొలి వ‌న్డే
  • అరంగేట్రం చేసిన భార‌త కుర్రాడు ఇషాన్ కిష‌న్
  • కోహ్లీ క్లీన్ షేవ్ చేసుకుంటే ఎలా ఉంటాడో అచ్చం అలాగే ఉన్న‌ ఇషాన్
Clean shaved virat kohli pics go viral

శ్రీలంకతో జ‌రుగుతున్న‌ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన తొలి వ‌న్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ వ‌న్డే ద్వారా ఆరంగేట్రం చేసిన భార‌త కుర్రాడు ఇషాన్ కిష‌న్ కు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

విరాట్ కోహ్లీ క్లీన్ షేవ్ చేసుకుంటే ఎలా ఉంటాడో అచ్చం అలాగే ఇషాన్ ఉండ‌డ‌మే అందుకు కార‌ణం. నిన్న మ్యాచులో విరాట్ కోహ్లీ ఆడ‌లేదు. శిఖ‌ర్ ధావ‌న్ సార‌థ్యంలో ఈ మ్యాచు జ‌రిగింది. అయితే, ఇషాన్‌ను చూసిన కొంద‌రు విరాట్ కోహ్లీయే మైదానంలోకి వ‌చ్చాడా? అంటూ మొద‌ట ఆశ్చ‌ర్యపోయారు.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 42 బంతుల్లోనే 59 ప‌రుగులు చేసి, తొలి వ‌న్డేలోనే అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. అంతేకాదు, నిన్న‌ అత‌డి పుట్టిన‌రోజు కూడా. అలా పుట్టిన‌రోజునే తొలి వ‌న్డే ఆడి వార్త‌ల్లో నిలిచాడు. అత‌డు అచ్చం క్లీన్ షేవ్ చేసుకున్న‌ కోహ్లీలా ఉన్నాడంటూ నెటిజ‌న్లు ఫొటోలు వైర‌ల్ చేస్తున్నారు.