KTR: కూరగాయల వ్యాపారి డబ్బు ఎలుకల పాలవడంపై స్పందించిన కేటీఆర్

  • మహబూబాబాద్ జిల్లాలో ఘటన
  • చికిత్స కోసం రూ.2 లక్షలు దాచుకున్న కూరగాయల వ్యాపారి
  • డబ్బును కొరికివేసిన ఎలుకలు
  • లబోదిబోమన్న వ్యాపారి
KTR responds after rats bites money of a vegetable seller

మహబూబాబాద్ జిల్లా ఇంద్రానగర్ తండాకు చెందిన రెడ్యానాయక్ అనే కూరగాయల వ్యాపారి దాచుకున్న రూ.2 లక్షల నగదును ఎలుకలు ముక్కలు చేసిన ఘటన తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే ఈ ఘటన గురించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల వ్యాపారి రెడ్యానాయక్ నుంచి ముక్కలైన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుని, తగిన ఆర్థికసాయం అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ను కేటీఆర్ ఆదేశించారు.

అటు, ఈ విషయంలో మరో మంత్రి సత్యవతి రాథోడ్ కూడా స్పందించారు. రెడ్యానాయక్ తో ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. డబ్బుల విషయంలో ప్రభుత్వం తగిన సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. చికిత్సపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు. మంత్రి ఆదేశాలతో అధికారులు బాధితుడు రెడ్యానాయక్ ను కలిశారు. ఎలుకలు కొరికివేసిన కరెన్సీ నోట్లను పరిశీలించారు.

కూరగాయల వ్యాపారం చేసుకునే రెడ్యానాయక్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును చికిత్స కోసం దాచుకున్నాడు. అయితే ఎలుకలు ఆ డబ్బును కొరికి ముక్కలు చేయడంతో అతడు హతాశుడయ్యాడు. ఎలుకలు కొరికిన నోట్లను చూసి కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అనేకమందిని కదిలించింది.

More Telugu News