ఈ కలెక్టర్ వెరీ వెరీ స్పెషల్!

18-07-2021 Sun 17:23
  • టోక్యో ఒలింపిక్స్ ముగిశాక పారాలింపిక్స్
  • దివ్యాంగుల కోసం విశ్వక్రీడా సంరంభం
  • భారత బ్యాడ్మింటన్ జట్టులో సుహాస్ 
  • సుహాస్ నోయిడా జిల్లా కలెక్టర్
  • పతకంపై ఆత్మవిశ్వాసం
Noida collector Suhas Yathiraj set to participate paralympics

సాధారణ ఒలింపిక్ క్రీడలు ముగిసిన వెంటనే, అదే వేదికలపై పారాలింపిక్స్ నిర్వహిస్తారు. దివ్యాంగుల్లోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తుంటారు. జపాన్ లో జరిగే టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఆగస్టు 24 నుంచి అక్కడే పారాలింపిక్స్ నిర్వహించనున్నారు. భారత్ నుంచి కూడా ప్రతిభావంతులైనా దివ్యాంగ క్రీడాకారులు ఈ విశ్వక్రీడాసంరంభంలో పాల్గొంటున్నారు. వీరందరిలోకి సుహాస్ యతిరాజ్ ఎంతో ప్రత్యేకం.

సుహాస్ బ్యాడ్మింటన్ క్రీడలో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే... ఆయన ఓ జిల్లాకు కలెక్టర్. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా జిల్లాకు సుహాస్ యతిరాజ్ కలెక్టర్ గా విధులు నిర్వరిస్తున్నారు. కానీ, క్రీడలంటే ప్రాణం. బ్యాడ్మింటన్ క్రీడలో విశేష నైపుణ్యం ప్రదర్శించే ఆయన భారత పారాలింపిక్ బ్యాడ్మింటన్ టీమ్ లో కీలక సభ్యుడు. సుహాస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో 3వ స్థానంలో ఉండడం ఆయన సత్తాకు నిదర్శనం. 2018 ఆసియా క్రీడల్లో సుహాస్ కాంస్యం సాధించారు.

టోక్యో పారాలింపిక్ క్రీడలకు వెళ్లబోతున్న నేపథ్యంలో సుహాస్ మీడియాతో మాట్లాడారు. భగవద్గీత సారాంశాన్ని తాను గట్టిగా నమ్ముతానని, కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుందని విశ్వసిస్తానని వెల్లడించారు. తనపై ఒత్తిడేమీ లేదని, కానీ వరల్డ్ ర్యాంకింగ్స్ లో టాప్-5లో ఉన్నందున తప్పకుండా పతకం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. విధి నిర్వహణ, ఆటలు తనకు ఇష్టమైనవని, వాటిపై తనకున్న అంకితభావం తనను ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు.

పగలు జిల్లా కలెక్టర్ గా విధి నిర్వహణలో శ్రమిస్తానని, రాత్రివేళ బ్యాడ్మింటన్ ప్రాక్టీసు చేస్తానని సుహాస్ యతిరాజ్ వివరించారు. తన ప్రస్థానంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎనలేనిదని, మనసుకు నచ్చిన పని చేయాలని వారు సూచించేవారని తెలిపారు.