టి-సిరీస్ మ్యూజిక్ కంపెనీ అధినేత భూషణ్ కుమార్ పై అత్యాచార ఆరోపణలు

16-07-2021 Fri 20:56
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మోడల్
  • ఉద్యోగం పేరిట అత్యాచారం చేశాడని వెల్లడి
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • తప్పుడు ఆరోపణలంటూ ఖండించిన టి-సిరీస్
Case filed on T Series music company owner Bhushan Kumar

బాలీవుడ్ లో ప్రముఖ మ్యూజిక్ కంపెనీల్లో ఒకటైన టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ (43) పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. 30 ఏళ్ల మోడల్ ఒకరు భూషణ్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇస్తానని నమ్మించిన భూషణ్ కుమార్ తనపై 2017-20 మధ్య కాలంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. తనతో సంబంధం పెట్టుకుంటేనే ఉద్యోగం ఇస్తానని ఒత్తిడి చేశాడని ఆమె వెల్లడించింది.

మోడల్ ఫిర్యాదు నేపథ్యంలో ముంబయిలోని అంధేరీ (వెస్ట్) పోలీసులు కేసు నమోదు చేశారు. టి-సిరీస్ మ్యూజిక్ కంపెనీ అధినేత భూషణ్ కుమార్ ను వివరణ కోరాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మోడల్ ఆరోపణలను టి-సిరీస్ వర్గాలు ఖండించాయి. అవి తప్పుడు ఉద్దేశాలతో చేసిన ఆరోపణలని కొట్టిపారేశాయి. తాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.