ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చాలి: పవన్ కల్యాణ్ డిమాండ్

16-07-2021 Fri 19:55
  • జాబ్ క్యాలెండర్ అంశంపై పవన్ స్పందన
  • 2.30 లక్షల ఉద్యోగాలకు హామీ ఇచ్చారని వెల్లడి
  • 10 వేల ఉద్యోగ ఖాళీలే చూపించారని ఆరోపణ
  • మరో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్
Pawan Kalyan demands another job calendar for unemployed youth

రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం, జాబ్ క్యాలెండర్లో 10 వేల ఉద్యోగాలనే చూపించడం కచ్చితంగా యువతను మోసగించడమేనని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో వైసీపీ మాటలు నమ్మిన నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ లో చూపించిన ఖాళీలతో తీవ్ర నిరాశకు గురైందని వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు.

ఈ నేపథ్యంలో, నిరుద్యోగ యువత ఆందోళనలకు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ నెల 20న అన్ని జిల్లాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు నిరుద్యోగులను కలుపుకుని వెళ్లి జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఎక్చేంజిలలో వినతిపత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం పునఃసమీక్షించాలని, ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీలను గుర్తించి, మరో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.