Karnataka: అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమోకానీ... అక్రమ సంతానం ఉండదు: కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యలు

  • పుట్టుక విషయంలో పిల్లల తప్పు ఉండదన్న హైకోర్టు
  • రెండో భార్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే విషయంపై ఆలోచించాలని ఆదేశం
  • చట్టబద్ధమైన వివాహాల వెలుపల జన్మించే చిన్నారుల రక్షణ గురించి పార్లమెంటు ఆలోచించాలని సూచన
There is no illegal Children says Karnataka High Court

అక్రమ సంతానం విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ ప్రపంచంలో అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో కానీ, అక్రమ సంతానం ఉండదని స్పష్టం చేసింది. పుట్టుక విషయంలో పిల్లల తప్పు ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది. ఒక కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కేసు వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ బెస్కాంలో గ్రేడ్ 2 లైన్ మెన్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలని ఆయన రెండో భార్య కుమారుడు బెస్కాంకు విజ్ఞప్తి చేశారు. అయితే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధమని, రెండో భార్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం కుదరదని బెస్కాం చెప్పింది. దీంతో అతను హైకోర్డును ఆశ్రయించాడు.

అయితే తొలుత ఈ పిటిషన్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ తోసిపుచ్చింది. అనంతరం ఈ కేసు డివిజన్ బెంచ్ కు వెళ్లింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎలా పుడతారని హైకోర్టు ప్రశ్నించింది. అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో కానీ, అక్రమ సంతానం ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది. సదరు ఉద్యోగి రెండో భార్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని బెస్కాంను ఆదేశించింది. అంతేకాదు, చట్టబద్ధమైన వివాహాలకు వెలుపల జన్మించే చిన్నారుల భవిష్యత్తుకు రక్షణ ఎలా కల్పించాలనే విషయం గురించి పార్లమెంటు ఆలోచించాలని సూచించింది.

More Telugu News