కాపులను మోసం చేసేలా చంద్రబాబు వ్యవహరించారు: మంత్రి కన్నబాబు

15-07-2021 Thu 16:54
  • ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం
  • అన్ని వర్గాలను ఆదుకోవాలన్నదే జగన్ సంకల్పం
  • కాపులతో పాటు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు అమలు చేస్తాం
Chandrababu deceived Kapus says Kannababu

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్నవారందరికీ ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ పై గత టీడీపీ ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని.... గత ప్రభుత్వ తీర్మానాలపై కేంద్ర ప్రభుత్వం ఎన్ని లేఖలు రాసినా చంద్రబాబు పట్టించుకోలేదని అన్నారు.

కాపులను మోసం చేసేలా గతంలో చంద్రబాబు వ్యవహరించారని కన్నబాబు ఆరోపించారు. కాపులకు బీసీ ఎఫ్ కేటగిరీ అని, ఈడబ్ల్యూఎస్ లో 5 శాతం రిజర్వేషన్లని చంద్రబాబు రెండు తీర్మానాలు చేశారని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా చంద్రబాబు వ్యవహరించారని అన్నారు. అన్ని వర్గాలను ఆదుకోవాలన్నదే జగన్ సంకల్పమని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోతో కాపులతో పాటు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లను అమలు చేస్తామని తెలిపారు.