జిందాల్ స్టీల్ కు 860 ఎకరాలను కేటాయించిన ఏపీ ప్రభుత్వం

15-07-2021 Thu 15:08
  • నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం-మోమిడి గ్రామాల మధ్య భూమి కేటాయింపు
  • రూ. 7,500 కోట్ల సామర్థ్యంతో ప్లాంటును నిర్మించనున్న జిందాల్
  • ప్రత్యక్షంగా 2,500 మందికి ఉపాధి
AP govt allocates 860 acres to Jindal Steel

జిందాల్ స్టీల్ ప్లాంటుకు ఏపీ ప్రభుత్వం 860 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం-మోమిడి గ్రామాల పరిధిలో భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కిన్నెటా పవర్ కు కేటాయించిన భూములను రద్దు చేసి, ఆ భూములను జిందాల్ స్టీల్ కు అప్పగించింది.

ఈ స్థలంలో రూ. 7,500 కోట్లతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జిందాల్ స్టీల్ ప్లాంటును నిర్మించనుంది. ఈ ప్లాంట్ ద్వారా 2,500 మందికి ప్రత్యక్షంగా, 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. వచ్చే నాలుగేళ్లలో ప్లాంట్ విస్తరణకు వెయ్యి నుంచి 3 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని జిందాల్ స్టీల్ అంచనా వేస్తోంది.