Hyderabad: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన.. నీట మునిగిన కాలనీలు

  • నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వాన
  • అంబర్‌పేట మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉప్పొంగుతున్న డ్రైనేజీలు
  • మూసారంబాగ్ వద్ద వంతెనపై నుంచి ప్రవహిస్తున్న నీరు
Heavy rain in Hyderabad since yesterday

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు, రోడ్లు నీట మునిగాయి. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అంబర్‌పేట, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో అంబర్‌పేట మూసీ పరీవాహక ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి. అంబర్‌పేట పరిధిలోని పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్ ఇళ్లలోకి మురుగునీరు చేరింది. మూసారంబాగ్ వద్ద వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ వైపు నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

నాగోల్‌లో కురుస్తున్న భారీ వర్షానికి అయ్యప్ప నగర్ నీట మునిగింది. ఈ ప్రాంతంలోని పలు కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుండడంతో పలు కాలనీల వాసులు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లో నిన్న ఉదయం కొంత తెరిపినిచ్చినట్టు కనిపించిన వాన సాయంత్రం నుంచి మళ్లీ మొదలైంది. అప్పటి నుంచి ఏకధాటిగా కురుస్తూనే ఉంది. ప్రధాన రహదారులపైకి కూడా నీరు చేరడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.

More Telugu News