Krishna District: కోర్టు ధిక్కరణ కేసు.. కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్‌ ఇంతియాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  • కోర్టు ధిక్కరణ కేసులో నిన్నటి విచారణకు గైర్హాజరు
  • డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావుపైనా వారెంట్ జారీ
  • 28కి కేసు విచారణ వాయిదా
Non Bailable Warrant issued against krishna district former collector Imtiaz

నిన్న జరిగిన కోర్టు విచారణకు హాజరు కాని కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఇంతియాజ్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) ఎం.శ్రీనివాసరావుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచాలని విజయవాడ పోలీసులను ఆదేశిస్తూ ఈ నెల 28కి విచారణను వాయిదా వేసింది.

దీని పూర్వాపరాలలోకి వెళితే, అర్హత ఉన్నా ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని తమకు వర్తింపజేయలేదంటూ జిల్లాలోని చందర్లపాడుకు చెందిన 20 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు గతేడాది అక్టోబరు 22న వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వారికి ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది.

అయితే, అధికారులు 2020-21 సంవత్సరానికి మాత్రమే నిధులు మంజూరు చేసి, అంతకుముందు ఏడాదికి సంబంధించిన నిధులు విడుదల చేయలేదంటూ బాధితులు ఈసారి కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. విషయం తెలిసిన అధికారులు ఇటీవల ఆ సంవత్సరానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేశారు.

మరోపక్క, కోర్టు ధిక్కరణ వ్యాజ్యం నిన్న విచారణకు వచ్చింది. అయితే, ఇంతియాజ్, డీఆర్‌డీఏ పీవోలతోపాటు వారి తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు గైర్హాజరయ్యారు. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు  న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వారిద్దరినీ అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు.

More Telugu News