దేశద్రోహం చట్టంపై మరో పిటిషన్... పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

14-07-2021 Wed 21:53
  • ఇటీవల అధిక సంఖ్యలో దేశద్రోహం కేసులు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ ఆర్మీ జనరల్
  • పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు
  • రేపు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ  
Supreme Court set to examine age old sedition law

ఇటీవల కాలంలో దేశద్రోహం లేదా రాజద్రోహం చట్టం తరచుగా వినిపిస్తోంది. ఈ చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, రిటైర్డ్ ఆర్మీ జనరల్ ఎస్జీ వొంబాత్కరే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎప్పుడో 60 ఏళ్ల నాటి కోర్టు తీర్పు దేశంలో రాజద్రోహం చట్టం మనుగడకు ఆధారంగా ఉందని, ఈ కాలం చెల్లిన చట్టానికి సమీక్ష అవసరమని వొంబాత్కరే తన పిటిషన్ లో అభిప్రాయపడ్డారు.

1962లో కేదార్ నాథ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వలసవాద కాలం నాటి సెక్షన్ 124 (ఏ)కు వత్తాసు పలుకుతున్నట్టుగా ఉందని ఆరోపించారు. నాటి తీర్పును స్వేచ్ఛ, సమానత్వం, సమగ్రత తదితర ప్రాథమిక హక్కుల పరిధి, పరస్పర అవగాహన, అంతర్గత సంబంధాలపై ఆంక్షలు ఉన్న కాలంలో ఇచ్చారని రిటైర్డ్ ఆర్మీ జనరల్ వొంబాత్కరే వివరించారు.

ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. రేపు (జులై 15) దీనిపై పరిశీలన చేపట్టేందుకు పిటిషన్ ను విచారణ జాబితాలో చేర్చింది.