Food Processing Policy: తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం

  • నేడు క్యాబినెట్ సమావేశం
  • ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ విధివిధానాలపై చర్చ
  • కీలక నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్
  • దరఖాస్తులకు తుదిగడువు పెంపు
Telangana cabinet approves new food processing policy

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన నేటి క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి మరింత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద సంఖ్యలో స్థాపించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో కనీసం 10 జోన్లు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. 2024-25 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ఈ తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది.

ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపే ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మార్గదర్శకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో ప్రభుత్వమే మౌలిక వసతులను అభివృద్ధి చేసి అర్హత మేరకు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేసింది. దీని ద్వారా 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 3 లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పించాలని నిర్ణయించారు.

ఈ విధానంలో రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు, పూలు, కూరగాయలు, చేపలు, మాంసం, కోళ్లు, పాలు, డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పట్ల ఆసక్తికలిగిన పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువు తేదీని జులై 31 వరకు పొడిగించారు.

More Telugu News