హైదరాబాదులో భారీ వర్షం... రంగంలోకి జీహెచ్ఎంసీ బృందాలు

14-07-2021 Wed 21:11
  • నగరంలో ఎడతెరిపిలేని వాన
  • రోడ్లన్నీ జలమయం
  • ప్రధాన రోడ్లపై మోకాలి లోతున నీరు
  • భారీగా ట్రాఫిక్ జామ్
  • వాహనదారులకు ఇబ్బందులు
Heavy rain lashes Hyderabad

హైదరాబాదు నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. దాంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది.

ఓవైపు డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు, మాన్సూన్ బృందాలు రంగంలోకి దిగాయి. నీరు ఎక్కువగా నిలిచిన చోట మోటార్ల ద్వారా పంపింగ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.